AP Cm Chandra Babu isn’t Aware of the Rules?

Chandrababu naidu garu 40 ఇయర్స్ ఎక్స్ పీరియన్స్… 14 ఏళ్లు ముఖ్యమంత్రి… ప్రధాని కన్నా రాజకీయాల్లో తానే సీనియర్ అని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తనకుండే పరిమితులు తెలియవా…. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువ వినిపిస్తున్న ప్రశ్న…..

చంద్రబాబు రాజకీయాల్లో బాగా ఆరితేరిన మనిషి… ఎలాంటి సమస్యలు తలెత్తినా చాలా చాకచక్యంగా పరిష్కరిస్తుంటారు. హుద్ హుద్ విలయం విశాఖ నగరాన్ని కోలుకోలేని దెబ్బతీస్తే కేవలం కొద్ది రోజుల్లోనే విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దారు. అదే విధంగా తిత్లీ తుఫాను సమయంలో ఉత్తరాంధ్రను ఆదుకున్నారు. ఇలాంటి రాజకీయ నేతకు ఈసీ నిబంధనలు తెలియవా అనే ప్రశ్న ఇప్పుడు అన్ని చోట్ల వినిపిస్తోంది.

సీఎంగా ఎప్పుడు బిజీ బిజీగా ఉండే చంద్రబాబు… అధికారులను పరుగులు పెట్టిస్తుంటారు. గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పై సుమారు 90 సార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరుకు పోలవరం నుంచి నీళ్లు విడుదల చేయాలని కంకణం కట్టుకున్నారు.  తాజాగా అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో పోలవరం ప్రాజెక్ట్ పై సమీక్షా సమావేశం నిర్వహించి ఈసీ నుంచి నోటీసులు అందుకున్నారు.  

తాజాగా ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న చంద్రబాబు జాతీయ స్ధాయిలో విపక్ష నేతలను ఏకం చేసారు. ప్రచారంలో కూడా ప్రధాని మోదీపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఎన్నికలు పూర్తవడంతో చంద్రబాబు మరోసారి కేంద్రాన్ని టార్గెట్ చేసారు. ఎన్నికల సంఘం కేంద్రం కనుసన్నల్లోనే పని చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

 ఏపీలో ఎన్నికలు ఆలస్యంగా ప్రారంభం కావడం.. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు విపక్ష నేతలతో సమావేశం పెట్టారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయని చెప్పినా ఈసీ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించిందని….50 శాతం  వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేసారు. ఈ విషయంలో చంద్రబాబుకి జాతీయ విపక్ష నేతల మద్దతు లభించింది.

ఇంతటి రాజకీయ చతురత కలిగిన వ్యక్తికి ఎన్నికల సంఘం నిబంధనలు తెలియవా… ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తన పరిమితులు ఆయనకు తెలియవా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మాములుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. అయినా సరే చంద్రబాబు తన పాలనపై పట్టు బిగిస్తున్నారు. సెక్రటేరియట్ ను వదిలి రావడం లేదు. ఎన్నికలు అయిపోయినా కూడా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీ గా ఉంటున్నారు.

11న పోలింగ్ ముగిసినప్పటి నుంచీ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలు తిరిగి.. బుధవారం అమరావతి వచ్చిన చంద్రబాబు.. వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ మంత్రి, అధికారులతో సీరియస్‌గా చర్చలు జరిపారు. జులై నెలలో గ్రావిటీపై నీళ్లివ్వాలని ఆదేశించారు. మరుసటి రోజు గురువారం రాజధాని నిర్మాణ పనుల్ని పర్యవేక్షించారు. మంత్రి నారాయణ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సీఆర్డీఏ అధికారులు కూడా పాల్గొన్నారు.

chandrababu naidu

ఈ మొత్తం వ్యవహారాన్ని ఓరకంట గమనిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్.. బాబు కదలికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తరచూ వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పడంతో.. సీఈసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని బాబుకు నోటీసులు పంపింది.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిమితులను గుర్తు చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏ విధంగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారని ప్రశ్నించింది. చంద్రబాబు చేస్తున్న చర్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి వస్తాయని హెచ్చరించింది. దీంతో ఏపీలో శాంతి భద్రతలపై ఏర్పాటు చేసిన సమావేశాన్ని చంద్రబాబు రద్దు చేసుకున్నారు.

సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించకూడదని ఆదేశిస్తూ, అధికారులందరికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రతులను అందజేసింది. ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉందని, అప్పటివరకు పాలన పక్కన పెట్టి ఖాళీగా కూర్చోనని చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం-రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించడం తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించడంపై కొన్ని పార్టీలు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం చంద్రబాబు సూచనలు చేయొచ్చు కానీ, ఏకంగా సమీక్షలు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ నివేదికను అందజేసారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకు నోటిసులు జారీ చేసింది.

Subscribe to our youtube channel at Chudubabai Youtube
Read our stories at Chudubabai Stories

Facebook Comments
Follow me

Sarath Chandra

I'm passionate about writing, also working as a journalist. I had an Idea to share my writings, so started this blog along with cousins
Follow me