జనం మెచ్చిన జగన్

జగన్ ఆత్మీయ స్పర్శకు ఆంధ్రావని పులకరించింది. నేనున్నా అని ఇచ్చిన హామీ ఓట్ల వర్షం కురిపించింది. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జగన్ చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. రావాలి జగన్… కావాలి జగన్ అంటూ ఇచ్చిన నినాదం అఖండ మెజార్టీని కట్టబెట్టింది. 

 శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ ఓట్ల సునామీ సృష్టించింది. ఓట్లు, సీట్ల వేటలో సరికొత్త రికార్డును సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పైగా ఓట్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. 151 స్ధానాల్లో విజయదుందుభి మోగించిన వైసీపీ రాష్ట్రంలో సరికొత్త చరిత్ర లిఖించింది. అంచనాలను తిరగరాస్తూ.. ఎగ్జిట్ పోల్స్ ను మించి వైసీపీ సాధించిన గెలుపు సొంత పార్టీల నేతలనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాయిస్… ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీ నివ్వెరపోయేలా వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అసెంబ్లీ, లోక్ సభ స్ధానాల్లోనూ టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టి జగన్ సృష్టించిన సునామీకి నాలుగు జిల్లాల్లో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర వ్యాప్తంగా 151 స్ధానాల్లో గెలుపొంది అసాధారణమైన విజయాన్ని అందుకుంది. 175 స్ధానాలున్న రాష్ట్రంలో టీడీపీ 7వ వంతు స్ధానాలను కైవసం చేసుకోలేకపోయింది. 21 మంది మంత్రులు ఎన్నికల బరిలో నిలవవగా కేవలం ముగ్గురు మాత్రమే గెలుపునందుకున్నారు. 

కుప్పంలో చంద్రబాబుకు మెజార్టీ తగ్గడం కూడా వైసీపీ ఆధిపత్యానికి నిదర్శనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కడప,కర్నూలు, నెల్లూరు,విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ జిల్లాల్లో మంత్రులు సవాళ్లు విసిరినా అవేమి వైసీపీ గెలుపు అడ్డుకోలేకపోయాయి. రాయలసీమలో 52 స్ధానాలకు గాను 50 స్ధానాలు కైవసం చేసుకున్న వైసీపీ… ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో సైతం ప్రభంజనం సృష్టించింది. 

ఇక టీడీపీ గెలుపు తధ్యం అనుకున్న స్ధానాల్లో సైతం వైసీపీ అభ్యర్ధులు విజయదుందుభి మోగించారు. లోక్ సభ స్ధానాల్లోనూ వైసీపీ ప్రభనం సృష్టించింది. 25 స్ధానాలకుగానూ 22 స్ధానాలను కైవసం చేసుకుని పార్లమెంట్ లో 4వ అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. కొన్ని స్ధానాల్లో కొత్త అభ్యర్ధులను నిలబెట్టినా ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు.  నవరత్నాల హామీలు జగన్ కు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ఇక పులివెందులలో సైతం జగన్ కు ప్రజలు నీరాజనాలు పట్టారు. 90 వేల అత్యధిక మెజార్టీతో ప్రజలు జగన్ కు పట్టం కట్టారు. ప్రభుత్వంపై వ్యతిరేకత… ఎమ్మెల్యేలపై విముఖత వైసీపీకి ఈ ఎన్నికల్లో బాగా కలిసొచ్చిన అంశాలు. పక్కా ప్రణాళిక… పాదయాత్ర వరంలా మారి వైసీపీని విజయపధంలో నడిపాయి. ఉహించిన స్ధానాలకన్నా ఎక్కువ స్ధానాలు లభించడంతో వైసీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.

Facebook Comments
Follow me

Sarath Chandra

I'm passionate about writing, also working as a journalist. I had an Idea to share my writings, so started this blog along with cousins
Follow me