జెండా కోసం… ఇంటినే అమ్మేశాడు…

A man who sold his house for flag
ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే ప్రతీ భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి…. అదే ఎలాంటి కుట్లు, అల్లికలు లేని జెండా మువ్వన్నెల జెండా ఎగిరితే…. ప్రతీ ఒక్కరి గుండె ఉప్పొంగుతుంది. అదే తన కోరిక కూడా అంటాడు రుద్రాక్షల సత్యనారాయణ. దేశంలోనే తొలిసారి కుట్లు, అల్లికలు లేని జాతీయ జెండా తయారు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

man who sold his house for flag
Sathyanarayana Nesina Jenda

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరానికి చెందిన రుద్రాక్షల సత్యనారాయణది మధ్య తరగతి చేనేత కుటుంబం. కుటుంబం మొత్తం కూడా 24 గంటలు నేత నేస్తూ బతుకు జీవనాన్ని సాగిస్తుంటారు. సత్యనారాయణది చేనేత చీరల తయారీలో అందెవేసిన చెయ్యి. చేనేతను ప్రాణంగా భావించే ఈ కళాకారుడు ఇప్పటివరకు దేశంలో ఎవరూ చేయనటువంటి ప్రయత్నం చేసాడు. మగ్గంపై ఇప్పటి వరకు ఎవరు నేయని జాతీయ జెండాను తయారు చేయాలనుకున్నాడు. అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగితే యూ ట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చూసి అతుకులు, కుట్లు లేని జాతీయ జెండా తయారు చేయాలనుకున్నా అని చెప్తాడు. అనుకున్నట్టుగానే తన ప్రయత్నం మొదలుపెట్టాడు.

man who sold his house for flag
Maggam Nesthuu Sathyanarayana

 తనదగ్గరున్న సొంత మగ్గం పైనే జెండా తయారీని ప్రారంభించాడు సత్యనారాయణ. 2013లో మొదటి ప్రయత్నంలోనే జెండా తయారీలో సఫలమయ్యాడు. 4X6  సైజులో జాతీయ జెండాను తయారు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కానీ ఎర్రకోటపై ఎగురవేసే జెండా కొలతలు ఇవి కావని తెలుసుకుని నిరాశపడ్డాడు. దీంతో ఎర్రకోటపై ఎగిరే జెండా కొలతలతో మరో జెండా తయారు చేయాలని సంకల్పించాడు. కానీ తన సంకల్పానికి అతని ఆర్ధిక స్ధితి అడ్డుతగిలింది. కానీ దేశ భక్తి ముందు ఆర్ధిక స్ధితిని ఎదిరించి అనుకున్నది సాధించాడు.

man who sold his house for flag
Sathyanarayana Konugolu chesina Maggam

8X12 సైజులో జెండా తయారీకి లక్షల్లో ఖర్చు అవుతుందని తెలుసుకున్న సత్యనారాయణ తన ప్రయత్నాన్ని వదిలెయ్యలేదు. ఆర్ధిక పరిస్ధితి అడ్డువచ్చినా కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో జెండా తయారీకి పూనుకున్నాడు. సత్యనారాయణ జెండా తయారీ గురించి తెలుసుకున్న కొంతమంది నాయకులు అండగా నిలిచారు. రాజకీయాలను పక్కనపెట్టి జెండా తయారీకి సహకరించారు. దీంతో 10 అడుగుల పురాతన మగ్గాన్ని కొనుగోలు చేసాడు.

పెద్ద మగ్గంపై నేయడానికి మరో ముగ్గురి సహకారం అవసరమైంది. దీంతో అతని భార్య, అక్క, బావ కూడా తనతో జెండా నేయడంలో సహకరించారు. నాలుగేళ్లుగా రాత్రి పగలు కలిసి కుటుంబమంతా జెండాను తయారు చేయడం ప్రారంభించారు. తమ సొంత పనులను సైతం మానుకుని జెండా తయారీలో నిమగ్నమయ్యారు. అతని సంకల్పానికి పట్టుదల తోడవడంతో కల నిజమైంది. ఎర్రకోటపై ఎగురవేసే సైజు జెండా కుట్లు, అల్లికలు లేకుండా తయారైంది.

కుట్లు అల్లికలు, ప్రింటింగ్ లేకుండా జాతీయ జెండా తయారుయడం అత్యంత క్లిష్టమైన పని. మూడు రంగులు దారాలు ఒకదానికి  మరొకటి కలవకుండా లింక్ వేసుకొని నేత వేయాలి. అలా ఎక్కడా చిన్న తేడా రాకుండా నాలుగేళ్లు కష్టపడి మువ్వన్నెల జెండాను తయారు చేశాడు.

Sathyanarayana with politicians
Amit Shah tho Sathyanarayana

జెండాలో మూడు రంగులు, అశోక చక్రంలో 24 రేఖలు ఆకర్షణీయంగా ఉండేలా 2400 పట్టుదారాలతో జాంధానీ, పైసానీ వర్క్ లతో జెండాను తయారు చేశాడు. ఇతడి జెండా జాతీయ నాయకులను సైతం మెప్పించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, స్మృతీ ఇరానీ లాంటి జాతీయ నేతలను కలిసి తన జాతీయ జెండాను చూపించాడు సత్యనారాయణ.  సత్యనారాయణ తయారు చేసిన జెండా జాతీయ స్థాయి నాయకులను బాగా ఆకర్షించింది. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అధికారంలోకి వచ్చాకా తనను కలవాలని చెప్పి జెండాను చూసి చాలా ముచ్చటపడ్డారు. నాలుగేళ్లు శ్రమించి తాను తయారు చేసిన మువ్వన్నెల జెండాను ఎర్రకోటపై ఎగరాలని ఆకాంక్షిస్తున్న సత్యనారాయణ కల నెరవేరాలని మనం కూడా కోరుకుందాం.

YS Jagan tho Sathyanarayana
YS Jagan tho Sathyanarayana

భారత్ మాతాకీ జై……..

This is the story of a man who sold his house for a flag.
People who read this also interested in this article: Journey of Ram Master
Follow the writer at: Sarath Chandra Ayyagari

Facebook Comments
Follow me

Sarath Chandra

I'm passionate about writing, also working as a journalist. I had an Idea to share my writings, so started this blog along with cousins
Follow me