Review On YS Jagans’s Government

Review on Jagan’s Government ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు… పాలనాపరంగా ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లేదు, నాయకుడిగా కూడా అంతంతా మాత్రం అనుభవమే ఉంది. కానీ నేనున్నాను అన్న ఒక్క హామీతో ప్రజలు వైఎస్ జగన్ కు పట్టం కట్టారు. ప్ర‌తి విష‌యంలో కొత్త‌ద‌నం చూపెడుతూ… నిత్యం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న జగన్ తొలి వారంలోనే తన మార్క్ పాలన చూపిస్తున్నారు.

వైఎస్ జగన్… తండ్రి మరణానంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీని స్థాపించి… సుమారు పదేళ్ల పాటు ప్రజల మధ్యనే గడిపారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు పరిమితమైన వైసీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని కఠిన దీక్షతో ఉన్న జగన్… అనుకున్నదే తడవుగా 3800 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి రాష్ట్రంలోని ప్రతి వర్గం వారిని కలుసుకున్నారు. వారి వారి సమస్యలు తెలుసుకుంటూ నేను విన్నాను… నేనున్నాను అనే భరోసానిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. జగన్ పై  నమ్మకం పెట్టుకున్న ప్రజలు భారీ మెజార్టీతో జగన్ కు పట్టం కట్టారు. దీంతో 151 స్ధానాలతో రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది.

ముందుగానే ప్రణాళికలు సిద్ధం : ఎన్నికలు పూర్తవ్వగానే వైఎస్ జగన్ సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటూ ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఫలితాలు వచ్చే వరకు 40 రోజుల గ్యాప్‌లో జగన్‌ ,అధికార యంత్రాంగం, మంత్రివర్గ కూర్పు మీద కసరత్తు చేసి తమ టీమ్‌ని రెడీ చేసుకున్నారు. దాని ఫలితంగానే ఏపీలో ఇప్పుడు అధికారుల బదిలీలు, సమీక్షలు ఇంత వేగంగా జరుగుతున్నాయి.

Review on Jagan's Government
AP CM YS Jagan

ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయడం కోసం కసరత్తు: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు సీఎం జగన్.. కొన్ని హామీలను అమలు చేసిన జగన్ మరికొన్ని వాటిని పరిశీలిస్తున్నారు. నవరత్నాలలో చెప్పిన విధంగానే వైఎస్ జగన్ తన తొలి సంతకం ఫించన్ల పెంపు పై పెట్టారు. ఒక్కో ఏడాది వృద్ధులకు ఇచ్చే పెన్షన్ పెంచుకుంటూ పోతామన్నారు. అదే విధంగా వికలాంగులకు మూడు వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ 10 వేలకు పెంచారు.

Review on Jagan's Government
Jagan taking his Oath as a CM

బిజీ బిజీగా సమీక్షలు: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జగన్ పాలనపై దృష్టి పెట్టారు. ఒక్కో రోజు ఒక్కో శాఖపై సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ అధికారులతో సరదాగా మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు. దీంతో సమీక్షలకు హాజరయ్యే అధికారులు సైతం కొత్త ముఖ్యమంత్రి పలకరిస్తున్న విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక ఆరోగ్య శ్రీపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్… 108, 104 వాహనాలను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అదే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని వైఎస్సార్ ఆరోగ్య శ్రీ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక పాదయాత్ర సమయంలో ఆశా వర్కర్లకు హామీ ఇచ్చినట్టుగా వారి జీతాలను 3 వేల నుంచి 10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Review on Jagan's Government
Review Meetings

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు : తన ఆలోచనలను ఎంత వేగంగా అయితే అమలు చేయాలనుకుంటున్నారో.. అంతే వేగంగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమర్థులైన అధికారులను ఎంపికచేసుకునే పనిలో జగన్‌ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను జగన్ బదిలీ చేశారు. ఇక ప్రమాణ స్వీకారానికి ముందే జగన్… సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని కొనసాగమని కోరారు. అదే విధంగా సీనియర్ అధికారి అజయ్ కల్లాంను ముఖ్య సలహాదారుడిగా నియమించుకొన్నారు. కిందటి ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని మాజీ సీఎం చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగిన అధికారులను సీఎం జగన్ బదిలీ చేశారు. దీంతో ఇప్పటి వరకు అప్రాధాన్య పోస్టుల్లో ఉన్నవారిని ముఖ్య పదవులు దక్కాయి.

Review on Jagan's Government
YS Jagan Appoints Ajay Kallam as Principal Advisor for CM

వివిధ శాఖలను ప్రక్షాళన చేస్తున్న జగన్ విద్యాశాఖపై ఫోకస్ పెట్టారు. తొలుత విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్… ఏపీలోని 44 వేల పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాలని ఆదేశించారు. అదే విధంగా విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని నిర్ణయించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని వైఎస్సార్ అక్షయ పాత్రగా నామకరణం చేస్తూ పాఠశాలల్లో విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందించాలని అదేశించారు.

Review on Jagan's Government

మద్యపాన నిషేదంపై ప్రత్యేక దృష్టి: పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా మద్యపాన నిషేధంపై జగన్ చర్యలు ప్రారంభించారు. మద్యపాన నిషేధంలోని తొలి దశలో భాగంగా రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎక్సైజ్ శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. మరో పది రోజుల్లో రాష్ట్రంలోని బెల్టు షాపులు తొలగించాలని ఎక్సైజ్ శాఖ సిబ్బందిని ఆదేశించింది. ఎక్కడైనా బెల్టు షాపు నిర్వహిస్తే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని జగన్ ఆదేశించారు. ఇక బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే వైన్ షాపుల లైసెన్స్ రద్దు చేయాలని జగన్ సూచించారు.

అవినీతిరహిత పాలన అందించేందుకు జగన్ కసరత్తు ప్రారంభించారు. జ్యూడీషియల్ కమీషన్ ఏర్పాటుకు సీఎం జగన్ ఏపీ ఛీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ తో సమావేశమయ్యారు. జ్యూడీషియల్ కమీషన్ ఏర్పాటు అవసరం, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై జగన్ వివరించారు. ఇక జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్ పోలవరం ప్రాజెక్ట్ పై ఆరా తీసారు. ఎక్కడైనా టెండర్లలో అవినీతి జరిగితే సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు.  

Review on Jagan's Government
Ap CM Jagan meets High Court Chief Justice Praveen Kumar on Judicial Commission

పోలీసులకు వీక్లీ ఆఫ్: పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా వైఎస్ జగన్ పోలీసులకు వీక్లీ ఆఫ్ పై డీజీపీతో చర్చలు జరిపారు.  ఇందుకోసం ఒక కమిటీని ఆయన నియమించాలని డిజిపికి సూచించారు. తదనుగుణంగా డిజిపి గౌతమ్ సవాంగ్ ఇరవై ఒక్క మంది అధికారులతో ఒక అద్యయన కమిటీని వేశారు. వీక్లి ఆఫ్ సాద్యాసాద్యాలపై వారు స్టడీ చేసి నివేదిక ఇచ్చిన తర్వాత తుది నిర్ణయం చేస్తారు. దీనివల్ల ఎంత మంది అదనపు సిబ్బంది అవసరం అవుతారు, తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ సూచనల మేరకు జగన్ పోలీసులకు వీక్లీ ఆఫ్ లు మంజూర్ చేస్తారు. అదే  కనుక అమలైతే బ్రిటిష్ వారి కాలం నుంచి ఖాకీ వృత్తిలో అసలు సెలవు అన్నది లేకుండా పనిచేస్తున్న పోలీసులకు  వారానికి ఒక రోజు  విశ్రాంతి దొరుకుతుంది.

Review on Jagan's Government
Review on Jagan’s Government

కేవలం వారం రోజుల్లోనే జగన్ పాలనలో తన మార్క్ ఏమిటో చూపించే ప్రయత్నం చేశారు. ఒక ముఖ్యమంత్రి పనితీరును కేవలం ఒక్క వారంలో అంచనా వేయడం కష్టం. కానీ జగన్ పని తీరు చూస్తే.. జగన్ భవిష్యత్ లో తన పాలనపై ఒక అంచనాకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని మాట ఇచ్చిన జగన్.. ఇంకా ఏమేం సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి. జగన్ దూకుడు మున్ముందు ఏ విధంగా ఉంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

Follow author at @sarathchandraAyyagari
Also read our article about Jagan’s

Facebook Comments
Follow me

Sarath Chandra

I'm passionate about writing, also working as a journalist. I had an Idea to share my writings, so started this blog along with cousins
Follow me